జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై తాజాగా అనకాపల్లి సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. 48 గంటల్లోగా ఈ వ్యాఖ్యలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆయనకు సూచించారు. దీంతో పవన్ వివరణ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో రాజకీయ ప్రత్యర్ధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో సీఎం జగన్ ను ఉద్దేశించి అనకాపల్లి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలు కూడా సమర్పించారు. దీంతో సీఈవో మీనా పవన్ కు నోటీసులు పంపారు. పవన్ అనకాపల్లి సభలో జగన్ ను స్కాంస్టర్, ల్యాండ్ గ్రాబర్, శాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే పవన్ తో పాటు సీఎం జగన్, చంద్రబాబుకు కూడా అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వివరణ కోరుతూ సీఈవో నోటీసులు జారీ చేసారు. అయినా ఈ అనుచిత వ్యాఖ్యల పరంపర ఆగడం లేదు. దీంతో పవన్ కు ఇచ్చిన నోటీసులపై ఆయన ఇచ్చే స్పందన ఆధారంగా సీఈవో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. పవన్ వివరణ సంతృప్తికరంగా ఉంటే సీఈవో వదిలేసే అవకాశముంది. సంతృప్తి చెందకపోతే మాత్రం తదుపరి చర్యల కోసం సీఈసీకి ఈ వ్యవహారాన్ని నివేదిస్తారు.