AP

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన షిప్ బియ్యం లెక్క తేలింది..! ఎంతంటే..?

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలతో సముద్రంలోనే నిలిపివేసిన స్టెల్లా ఫిష్ లో తనిఖీలు పూర్తి చేసిన అధికారులు.. అందులో రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సముద్రంలోకి పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. పవన్ ఎంట్రీతో మరింత అప్రమత్తమైంది. సముద్రంలో లోడింగ్ కోసం వేచియున్న నౌక దగ్గరకు వెళ్లిన అధికారులు.. దానిని పోర్టు నుంచి వెళ్లకుండా అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. దాంతో.. రేషన్ బియ్యం అక్రమ వ్యవహారం నిజమేనని తేలింది.

 

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో స్టేల్లా షిప్ ను నిలిపివేసిన అధికారులు.. అందులో 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తీవ్రంగా పయత్నాలు చేస్తున్న జిల్లా యంత్రాంగం.. క్రమంగా అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా తొలుత స్టెల్లా నౌకలోని బియ్యం పైనే దృష్టి సారించింది. ఇక్కడ అధికారుల తనిఖీలు, వెల్లడైన అంశాలపై.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ రాహుల్ మీనా, ఎస్పీ ఎస్పీ విక్రంత్ పాటిల్ మీడియాకు వివరాలు అందజేశారు.

 

ప్రజలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయగా.. అనుమానాస్పద ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం తనిఖీల సమయంలో స్టెల్లా నౌకలో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. దాంతో.. పూర్తిగా నౌకను పరిశీలించి, తనిఖీలు నిర్వహించేందుకు ఐదు ప్రభుత్వ శాఖలకు చెందిన బృందాలు స్టెల్లా షిప్ లో 12 గంటల పాటు తనిఖీలు నిర్వహించాయి. అందులో.. 4,000 టన్నుల బియ్యాన్ని గుర్తించగా.. వాటి నుంచి శాంపిల్స్ సేకరించి ప్రభుత్వ ల్యాబ్ లకు పంపించారు. అందులో ముందుగా గుర్తించిన 640 టన్నుల రేషన్ బియ్యంతో పాటు అదనంగా మరో 680 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

 

రేషన్ బియ్యం ఎగుమతి చేసింది ఆ సంస్థే

 

రేషన్ బియ్యంగా గుర్తించిన సరకును సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో.. అసలు వారు ఎక్కడి నుంచి, ఎలా పీడీఎస్ బియ్యాన్ని సేకరిస్తున్నారు అనే విషయమై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంస్థను అడ్డుపెట్టుకుని ఎవరెవరు అక్రమ రవాణా చేస్తున్నారు. వస్తున్న డబ్బుల్లో ఎవరి వాటాలు ఎంత అనే విషయాలపైనా ప్రభుత్వ పెద్దలు గట్టిగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా.. స్టెల్లా షిప్ లో దొరికిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన ఉన్నతాధికారులు.. ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సముద్రంలోని షిప్ లో లోడ్ చేసిన బియ్యాన్ని పూర్తిగా తిరిగి ఒడ్డుకు చేర్చి.. ప్రభుత్వ గోదాములకు చేర్చుతామని కలెక్టర్ షన్మోహన్ ప్రకటించారు. ఈ బియ్యంతో పాటు యాంకరేజ్ పోర్ట్ లోని బాజీపో 1000 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని లవాన్ కంపెనీ నుంచి ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచగా.. వాటిని సీజ్ చేశారు.

 

కఠిన చర్యలుంటాయి.. జాగ్రత్త

 

డిప్యూటీ సీఎం ఆదేశాలు, స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రైస్ మిల్లుల దగ్గర నుంచి బియ్యం రవాణా చేసే ఆటోల వరకు అన్నింటిపై పోలీసు నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ విధానాలు, ఉద్దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠినంగా ఉంటామన్న అధికారులు.. ఎగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. నిజాయితీగా ఎగుమతులు చేసే వారికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సహకరిస్తాయని ప్రకటించారు.