AP

పేర్ని నానికి మరో షాక్-రేషన్ దందాపై సిట్ దర్యాప్తు..?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్ గా ఉంటూ దాదాపు 4 వేల టన్నుల బియ్యం మాయం చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్నినాని భార్య జయసుధతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఇప్పటికే విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు నిన్న వాళ్ల ఇంటికి వెళ్లి లుక్ అవుట్ నోటీసులు కూడా అంటించి వచ్చారు.

 

గతంలో రేషన్ డీలర్ గా ఉంటూ రేషన్ బియ్యం మాయం చేసిన పేర్ని నాని భార్య జయసుధ.. ఆ తర్వాత అందులో కొంత మొత్తానికి డీడీలు తీసి ప్రభుత్వానికి బకాయి చెల్లించారు. అయితే అసలు ఇక్కడి నుంచి మాయం చేసిన బియ్యం కాకినాడ పోర్టుకు చేరిందా లేక మరెక్కడికైనా పంపించారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు సకాలంలో పేర్ని కుటుంబానికి నోటీసులు ఇచ్చి విచారణ చేయకోపోవడంతో వారు తప్పించుకున్నారన్న చర్చ జరుగుతోంది.

 

ఈ నేపథ్యంలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్ని ఫ్యామిలీ వ్యవహారంపై స్పందించారు. పేర్ని నాని పేదల బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకుని తిరగడమెందుకన్నారు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కుంభకోణంపై సిట్‌ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానని వెల్లడించారు. విచారణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని తెలిపారు. దీంతో ప్రభుత్వం కూడా పేర్ని కుటుంబాన్ని పోలీసులు వదిలేయడంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సిట్ ఏర్పాటు చేస్తే తప్ప వాస్తవాలు బయటికి రావని సర్కార్ పెద్దలు భావిస్తున్నారు.