AP

ఆ మూడు స్కీమ్స్ కి గ్రీన్ సిగ్నల్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..

ఏపీలో ఎప్పుడు ఎప్పుడు అంటూ ఆ పథకాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో శుక్రవారం ఏపీ కేబినెట్ భేటీ సాగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల గురించి సుధీర్గంగా చర్చ సాగింది. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి తొలితగతిన నిర్మాణ పనులు సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

 

ఇక సూపర్ సిక్స్ పథకాల గురించి కేబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ సాగింది. తల్లికి వందనం స్కీం అమలుపై చర్చించిన సీఎం చంద్రబాబు, రానున్న విద్యా సంవత్సరంలో పథకానికి శ్రీకారం చుట్టాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా కేబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం పీఎం కిసాన్ నగదును విడుదల చేసిన వెంటనే, అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అన్నదాత సుఖీభవ నగదును జమ చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

 

పోలవరం డయాఫ్రంవాల్ వెంటనే ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలాన్ని పేదలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు భేటీ అనంతరం ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఏపీ కేబినెట్ భేటీలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీకి చర్చ సాగగా, వాటి అమలుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

మంత్రుల భేటీ అనంతరం మంత్రి పార్థసారథి నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. అలాగే రైతులకు ధాన్యం అమ్మిన వెంటనే నగదు జమపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని, ఇంకా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అంతేకాకుండ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే తల్లికి వందనం కార్యక్రమం అమలుకు ఏయే మార్గదర్శకాలు జారీ చేయాలన్న విధానంపై చర్చ సాదిందని మంత్రి తెలిపారు.