రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… తమ పార్టీలో విజయసాయి రెడ్డి కీలక నేత అని చెప్పారు. జగన్ సీఎం కావాలని ఆయన కలలు కన్నారని… ఇప్పుడు రెండోసారి జగన్ ను సీఎం చేసేందుకు పని చేస్తున్నారని అన్నారు. విజయసాయిపై కొందరు టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని ఆరోపించారు.
విజయసాయిపై ఎన్ని కుట్రలు చేసినా… ఆయన చలించకుండా కుట్రలను ఎదుర్కొన్నారని కాకాణి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయసాయి రెడ్డి గెలుస్తారని అందరం భావించామని… కానీ, దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని చెప్పారు. విజయసాయి నిర్ణయంపై పూర్తి వివరాలు తెలుసుకున్నాక స్పందిస్తామని అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయం తీసుకుని ఉంటే… ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతామని చెప్పారు.