ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. వీటిని అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ ను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా నేరస్థుల బారిన పడకుండా జాగ్రత్తపడేలా చూస్తున్నామని వివరించారు. ఇటీవల చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని డీజీపీ అన్నారు.
గంజాయి నివారణకు ఈగల్..
రాష్ట్రంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు మాత్రం ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయని డీజీపీ చెప్పారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ సంస్థను ఏర్పాటుచేసి ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నట్లు వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా గంజాయి నిర్మూలన కోసం క్యాబినెట్ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిందని డీజీపీ గుర్తుచేశారు.
నేరాల కట్టడికి సీసీ కెమెరాలు..
టెక్నాలజీ సాయంతో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా ఏదో ఒక కెమెరాలో రికార్డయ్యేలా సీసీ కెమెరాలను అమర్చుతున్నామని చెప్పారు. మార్చి 1 నాటికి మొత్తం లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ఆ దిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం దాతలు, ప్రజల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు.