AP

వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు.. ఎస్సీ, ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్ మెంట్ లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదయింది.

 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు సత్యవర్ధన్ ను కోర్టుకు కారులో తీసుకొచ్చారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఆ తర్వాత సత్యవర్ధన్ ను వంశీ విశాఖకు పంపించారు.

 

ఈ క్రమంలో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సత్యవర్ధన్ ను పోలీసులు విచారించగా… కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను కిడ్నాప్ చేసి బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.