AP

జగన్‌కు కష్టాలు తప్పవా..?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మళ్లీ ఇబ్బందులు తప్పవా? ప్రజల్లో సానుభూతి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఏదో విధంగా జైలుకి వెళ్లాలని నిర్ణయించుకున్నారా? కావాలనే పోలీసులను ఆయన బెదిరించారా? బెయిల్‌పై వున్న జగన్ ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? ఎందుకు జగన్ సహనం కోల్పోయారు? దీనిపై కూటమి సర్కార్ ఆలోచన ఎలా ఉంది? కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

నోరు జారుతున్న జగన్

 

వైసీపీ అధినేత జగన్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఏదైనా విషయంపై రియాక్టు అయ్యేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. తేడా వస్తే ఆయనకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్నారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేస్తే, తక్షణమే బెయిల్ రద్దవుతుంది.

 

అందుకే మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని చెబుతున్నారు కొందరు నేతలు. వైసీపీ వ్యవహారాలను గమనించిన కొందరు నేతలు, ఏదో విధంగా జైలుకి వెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. జైలుకి వెళ్తే దాని ద్వారా సింపథీ క్రియేట్ అవుతుందని, ప్రజలు తమవైపు మొగ్గు చూపుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు ఆయన ఓపెన్ వార్నింగ్ ఇస్తున్నారని అంటున్నారు.

 

అధికారులపై ఆగ్రహం ఎందుకు?

 

మంగళవారం బెంగుళూరు నుంచి విజయవాడ వచ్చారు వైసీపీ అధినేత జగన్. ఆ తర్వాత ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయం కాసేపు పక్కనబెడదాం. బయటకు వచ్చిన తర్వాత జైలు బయట మీడియాతో మాట్లాడారు జగన్. ఈ క్రమంలో పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తమ టోపీపై ఉండే మూడు సింహాలకు పోలీసులు సెల్యూట్ చేస్తే బాగుండేదన్నారు.

 

నాయకులకు అధికారులు తలవంచడం సరైన పద్దతి కాదన్నారు జగన్. తమ నాయకులపై ఆక్రమ కేసులు పెట్టిన అధికారులను.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలూడదీసి నిలబెడతామన్నారు. ఏ ఒక్కర్నీ వదలబోమని పలుమార్లు పదే పదే హెచ్చరించారు. రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తామని వ్యాఖ్యానించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

 

ప్రభుత్వం ఆలోచనేంటి?

 

వల్లభనేని వంశీ కేసు విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో అధికారులను మాజీ సీఎం ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం అధికారులకు బెదిరించడమేనని అంటున్నారు. దీనిపై కొందరు పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులను బెదిరింపుల కింద జగన్‌పై కేసు నమోదు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు టీడీపీ నేత ఒకరు చెప్పారు.

 

గతంలో వైసీపీ కార్యాలయంలో మీడియా మాట్లాడిన జగన్, అప్పటి తిరుపతి ఎస్పీని సుబ్బరాయుడ్ని ఇదే విధంగా హెచ్చరించారని అంటున్నారు కూడా. జగన్ బయటకు వచ్చిన ప్రతీసారి ఈ విధంగా వార్నింగ్ ఇస్తే తాము ఉద్యోగాలు చేయలేమని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో జగన్‌పై కేసు నమోదు చేయడమా అనే దానిపై క్లారిటీ రావచ్చని అంటున్నారు. జగన్ మాటలపై సీబీఐ సైతం ఫోకస్ చేసిందని అంటున్నారు.