ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. కూటమిలోని మూడు పార్టీలకు ఈ అయిదు స్థానాల్లో ఎవరికి ఎలా అవకాశం ఇవ్వాలనే దాని పైన సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు టీడీపీకి దక్కనుండగా.. బీజేపీ – జనసేనకు చెరో స్థానం కేటాయించేలా నిర్ణయం జరిగింద ని సమాచారం. ఇక, అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి జాబితాలో అనూహ్య ఎంపిక ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ కసరత్తు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మె ల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్‌బాబు, బి.తిరుమల (బీటీ) నాయుడి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. కాగా, తిరిగి భర్తీ చేసే స్థానాల్లో మూడు టీడీపీ, మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ – జనసేన కు చెరో స్ధానం దక్కనున్నాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు దాదాపు ఖాయమైంది. ఇప్పటికే నాగబాబు కు మంత్రి పదవి పై హామీ ఇవ్వటంతో ఎమ్మెల్సీ కావటం లాంఛనంగా కనిపిస్తోంది.
నాగబాబు ఇన్.. వర్మ కు దక్కేనా
ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న వారిలో టీడీపీ సీనియర్ నేత యనమల ఉన్నారు. తిరిగి ఛాన్స్ దక్కటం యనమలకు కష్టంగా మారుతోంది. యనమల కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా, ఒకరు ఎంపీగా ఉన్నారు. యనమల కు భవిష్యత్ లో ప్రాధాన్యత ఇచ్చేలా హామీ ఇచ్చేందుకు సి ద్దం అయినట్లు సమాచారం. ఇక, 2024 ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేత లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. బీజేపీ కి ఒక సీటు దక్కనుంది. పిఠాపురం లో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఈ విడత అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. వర్మకు సీటు విషయం లో జనసేన నుంచి అభ్యంతరం లేకపోతే వర్మకు ఛాన్స్ దక్కనుంది.
టీడీపీ నుంచి రేసులో
టీడీపీ నుంచి మిగిలిన మూడు స్థానాల కోసం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మైనారిటీ కోటాలో విశాఖపట్నంకు చెందిన ఎండీ నజీర్ రేసులో ఉన్నారు. అదే సమయంలో బీదా రవిచంద్ర, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మోపిదేవికి ఎమ్మెల్సీ హామీ ఉంది. బీసీ, ఓసీ, మైనార్టీ లేదా ఎస్సీ లకు మూడు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ తుది నిర్ణయం జరగనుంది. దీంతో.. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టీడీపీ నుంచి ఎవరికి చివరగా అవకాశం దక్కుతుందనేది పార్టీలో ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.