ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఇప్పటికే పలు తీర్మానాలు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సమస్యకు సంబంధించి జోక్యం చేసుకోవాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజాగా తిరుమల కొండపై నుంచి వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఎప్పటి నుంచో ఇలాగే విమానాలు చక్కర్లు కొడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఆగమశాస్త్రానికి విరుద్దమంటూ పండితులు, అర్చకులు, భక్తులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అయినా విమానాల రాకపోకల్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నా పరిస్ధితి మారేలా కనిపించడం లేదు. దీంతో ఇవాళ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం కోరుతూ లేఖ రాశారు.
ఇందులో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఆగమశాస్త్రం, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాల్ని కూడా దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాఫ్టర్లు, ఇతర విమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని ఆరోపించారు. కాబట్టి తిరుమల ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపడటానికి నో ప్లై జోన్ ప్రకటన అత్యంత అవసరమని తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.