AP

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై షాక్..

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అసెంబ్లీ వేదికగా ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో నాదెండ్ల మనోహర్ చెప్పేశారు. బీజేపీ సభ్యులు ఈశ్వరరావు, విష్ణుకుమార్ రాజు, పార్ధసారధి అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. దీంతో కొత్తగా ఇప్పట్లో కార్డుల జారీ లేనట్లేనని తేలిపోయింది.

 

ప్రస్తుతం బియ్యం కార్డులు ఈకేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త బియ్యం కార్డులకు, కార్డుల విభజనకు వీలు కల్పించే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మార్చి 31 కల్లా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డుల జారీ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు.

 

ప్రభుత్వం ఎప్పుడూ పేద కుటుంబాలకు అండగా నిలబడాలని మాత్రమే కోరుకుంటోందని నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో కోటీ 46లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, దీని ద్వారా 4 కోట్ల మందికి పైగా కుటుంబ సభ్యులకు తాము రేషన్ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రత చట్టం, కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా వీటి అర్హత నిబంధనలు పెట్టామన్నారు.

 

రేషన్ కార్డుతోనే అన్నీ వస్తాయని లబ్దిదారులు భావిస్తున్నారని, అందుకే దాన్ని రైస్ కార్డుగా మార్చాలని భావిస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు. 4 కోట్లకు పైగా లబ్దిదారులకు తాము రేషన్ కార్డులు ఇస్తున్నామని, కానీ కేంద్రం నుంచి మాత్రం 61 శాతం సాయం మాత్రమే దీనిపై తమకు అందుతోందన్నారు.