AP

ఏపీకి ప్రభుత్వానికి కొత్త సలహాదారులు..

ఏపీలో కూటమి సర్కార్ ప్రభుత్వానికి కొత్తగా సలహాదారులను నియమించింది. వైసీపీ మాదిరిగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎంపిక జాగ్రత్త వహించారు. ఎంపికైనవారు ఉన్నత రంగాలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులు. ప్రభుత్వం సైతం ఆయా రంగాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో వారి ఎంపిక ప్రభుత్వానికి తేలికైందని ప్రభుత్వ వర్గాల మాట.

 

కూటమి సర్కార్ కీలకమైన సలహాదారులు

 

వైసీపీ ప్రభుత్వంలో సలహాదారులకు కొదవలేదు. ప్రతీ శాఖకు, అలాగే ప్రభుత్వానికి దాదాపు 90 మందిని నియమించింది. వారి ఎంపికపై న్యాయస్థానాలు సైతం మొట్టికాయలు పెట్టాయి. అయినా చివరి వరకు వారినే కంటిన్యూ చేసింది. సలహాదారులకు కీలకమైన రంగాల్లో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ప్రస్తుతం కూటమి సర్కార్ అదే చేసింది.

 

ఇస్రో మాజీ ఛైర్మన్‌ సోమనాథ్, కేంద్ర రక్షణశాఖ మాజీ సలహాదారు సతీష్‌రెడ్డి, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్‌ సైన్స్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను నియమించింది. కేబినెట్‌ హోదా కలిగివుంటారు. వీరిని సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారు.

 

సతీష్‌రెడ్డి మాజీ డీఆర్‌డీఓ ఛైర్మన్‌

 

సతీష్‌రెడ్డి రక్షణ రంగ శాస్త్రవేత్త. గతంలో రక్షణమంత్రికి శాస్త్ర సలహాదారుగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆ తర్వాత డీఆర్‌డీఓ ఛైర్మన్‌, డీడీఆర్‌డీ కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిస్సైల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ విభాగాల్లో పని చేవారు. లండన్‌లోని రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీ సభ్యత్వం, అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌ మిస్సైల్‌ సిస్టమ్స్‌ వంటి అవార్డులను అందుకున్నారు.

 

ఏపీని ఏరోస్పేస్, డిఫెన్స్‌ పరిశోధన, వంటి విభాగాల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా తయారు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. అలాగే డీప్‌టెక్, ఏఐ, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి సాంకేతికతలను వినియోగించుకునేందుకు వీలుగా సలహాలు ఇవ్వనున్నారు.

 

సోమనాథ్ ఇస్రో మాజీ ఛైర్మన్

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్పేస్‌ టెక్నాలజీ సలహాదారుగా ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్ నియమితులయ్యారు. స్పేస్ విభాగంలో 40 ఏళ్ల అనుభవం ఆయన సొంతం. స్పేస్ విభాగంలోని పలు విభాగాల్లో పని చేశారు. ప్రస్తుతం విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

 

పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్‌ టెక్నాలజీని వినియోగించుకోవటానికి ఆయన సేవలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అర్బన్‌ ప్లానింగ్, వాతావరణ మార్పులు, స్మార్ట్‌ సిటీలు, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో ఆయన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.

 

కేపీసీ గాంధీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ శాస్త్రవేత్త

 

ఫోరెన్సిక్‌ సైన్స్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కేపీసీ గాంధీ. గతంలో ఏపీ, బెంగాల్, జమ్మూ కశ్మీర్‌ లకు ఫోరెన్సిక్‌ సలహాదారుగా పని చేశారు. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ లో పనిచేసిన ఆయన, ఉమ్మడి ఏపీలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల డైరెక్టర్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌కు సొంతంగా ట్రూత్‌ ల్యాబ్స్‌ను ప్రారంభించారు.

 

నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపుకు వీలుగా ఫోరెన్సిక్‌ డేటా ఇంటిగ్రేషన్‌కు సహకారం ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ పరిశోధన సంస్థల సహకారంతో ఆ టెక్నాలజీ ఏపీకి లభించేలా చూడటం మరో కీలకమైన అంశం. ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు మరిన్ని అందించేలా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో కలిసి పని చేయనున్నారు.

 

సుచిత్ర ఎల్ల భారత్‌ బయోటెక్‌ సంస్థ

 

భారత్‌ బయోటెక్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్ల. ప్రస్తుతం ఆమె టీటీడీ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. చేనేత, హస్తకళల రంగాల బలోపేతానికి అవసరమైన సలహాలు ఇవ్వనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న విధానాలు సూచించనున్నారు.

 

అలాగే ఆయా రంగాలకు మార్కెట్‌ అవకాశాలను పెంచడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకట్టుకోవడం కీలకమైనది. డిజిటల్‌ మార్కెటింగ్‌ వ్యూహాలతోపాటు సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ మార్కెట్‌ వేదికలను ఉపయోగించుకునేందుకు సలహాలు ఇవ్వనున్నారు. ప్రత్యేక కళలకు భౌగోళిక గుర్తింపు, మేధోసంపత్తి హక్కులు పొందేందుకు సహకారం అందించడం కీలకమైన అంశం.