AP

అజ్ఞాతంలో కాకాణి..! అరెస్ట్ భయంతోనేనా..?

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి రెండు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈరోజు పోలీసులు ఆయన ఇంటికి వచ్చిన అక్రమ క్వారీ నిర్వహణ కేసులో నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు. ఆయన వస్తారని వేచి చూసినా రాలేదు, ఫోన్లో సంప్రదించాలని చూసినా ఫలితం లేదు. చివరకు ఆయన ఇంటి గేటుకి పోలీసులు నోటీసులు అంటించి వెళ్లారు.

 

అసలేంటి కేసు..?

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో రుస్తుం మైన్స్ ఉంది. అందులోనుంచి క్వార్ట్జ్‌ ఖనిజాన్ని అక్రమంగా తరలించారనేది కేసు. అంతే కాదు, ఇక్కడ అనధికారికంగా పేలుడు పదార్థాలను వినియోగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అభియోగాల కింద పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏ-4గా ఉన్నారు. కొంతమందిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కాకాణి అరెస్ట్ కూడా తప్పదని అనుకున్నారంతా. ఈరోజు కాకాణి ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన అక్కడ లేరు. దీంతో ఇంటి గేటుకి పోలీసులు నోటీసులు అంటించారు.

 

 

అజ్ఞాతంలో కాకాణి..

అరెస్ట్ భయంతో కాకాణి రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే ఆయన అరెస్ట్ లకు తాను భయపడేది లేదంటూ గతంలో గంభీరంగా మాట్లాడేవారు. పోలీసులు అరెస్ట్ చేసినా బెయిల్ వస్తుందనేది ఆయన ధీమా. అయితే పోలీసులు తెలివిగా వరుస సెలవల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే అనుమానం వచ్చింది. అందుకే సెలవలకు ముందే ఆయన నెల్లూరు నుంచి జంప్ అయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా పార్టీ నేతలకు తెలియదంటున్నారు.

 

నోటీసుల్లో ఏముంది..?

క్వారీ అక్రమ రవాణా కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు కాకాణి ఇంటికి వెళ్లారు పొదలకూరు ఎస్సై హనీఫ్. ఆయన లేకపోవడంతో రెండు గంటల సేపు అక్కడే ఉన్నారు. చివరకు గేటుకి నోటీసులు అంటించి వచ్చారు. ఈనెల 31, సోమవారం ఉదయం 11 గంటలకల్లా కాకాణిని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

 

గతంలో కూడా కాకాణిపై పలు కేసులు ఉన్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి ఆస్తుల గురించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారనే కేసుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోర్టులో సాక్ష్యాల దొంగతనంలో కూడా ఆయన హస్తం ఉందని ఆరోపణలు వినిపించాయి. తాజాగా అక్రమంగా క్వార్ట్జ్ తరలించారనే కేసు నమోదైంది. ఈ కేసునుంచి కాకాణి తప్పించునే అవకాశం కనిపించడంలేదు. దీంతో ఆయన పరారీలో ఉన్నారని తెలుస్తోంది.

 

సర్వేపల్లిలో వరుస విజయాలు సాధించిన కాకాణి గత ఎన్నికల్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పట్నుంచి ఆయన దూకుడు కాస్త తగ్గింది. అయితే నెల్లూరు జిల్లా నుంచి ఒక్క వైసీపీ నేత కూడా గెలవకపోవడంతో జగన్ కి ఆయనే దిక్కయ్యారు. దీంతో ఎన్నికల తర్వాత కాకాణికి మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. జగన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఇటీవల కాకాణి నిరసన కార్యక్రమాలతో హడావిడి మొదలు పెట్టారు. ఈలోపు ఆయనపై కేసు నమోదు కావడం విశేషం.