ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కూటమిలో మూడు పార్టీలు భాగస్వాములుగా కొనసా గుతూనే.. సొంతగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వరుసగా మూడో సారి కేంద్రం లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఈ సారి దక్షిణాది పైన ప్రత్యేకంగా గురి పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా తెలుగు వ్యక్తి కి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో వైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పదవి విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రధాని మోదీ మిషన్ -2029 ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ సారి మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యూహాలు అమ లు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకం పైన నిర్ణయానికి వచ్చినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు పదవి విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికే పార్టీ జాతీయాధ్యక్ష పదవి దక్కుతుందని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పేరు ప్రస్తావనకు రాగా, మంత్రిగా కొనసాగేందుకే ఆయన మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఏపీ నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఈ సారి ఆరెస్సెస్ నేపథ్యం క్రియాశీలకం కానుంది. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో మహిళకు ఇవ్వాలనే ఆలోచన సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, మహిళకు బీజేపీ పగ్గాలు దక్కుతాయా అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ అంశమే ఢిల్లీ కేంద్రంగా సంచలనంగా మారింది. ఇదే సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటుగా లోక్ సభ లో డిప్యూటీ స్పీకర్ పదవి పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తొలుత ఈ పదవి మిత్రపక్షాలకు ఇవ్వాలని భావించారు. అయితే, జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలతో దక్షిణాది నుంచి తమ పార్టీకి చెందిన వారికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.