మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రెండో కేబినెట్ సమావేశంలోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి, శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రానున్న 365 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంలో ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి డ్రైవర్స్ కాలనీ, సలాం సెంటర్, ఉండవల్లి సెంటర్, సీతానగరం, పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన 354 మందికి మంత్రి లోకేశ్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగళగిరి అభివృద్ధికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని పునరుద్ఘాటించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో ఎప్పుడూ లేని విధంగా 90 రోజుల్లోనే ఫైలును కేబినెట్ ముందుకు తీసుకువచ్చామని తెలిపారు.
భూగర్భ డ్రైనేజీ, నీరు, గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టులను జూన్ నెల నుండి ప్రారంభిస్తామని లోకేశ్ వెల్లడించారు. పార్కులు, చెరువులను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం మొదటి పార్కును ప్రారంభించామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో 31 కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చానని, అందులో 17 భవనాలకు స్థలాలు గుర్తించామని, రెండింటి నిర్మాణాలు ప్రారంభించామని తెలిపారు. రానున్న 18 నెలల్లో కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిని గుర్తు చేస్తూ, ప్రస్తుతం గుంతలు పూడ్చి రోడ్లను బాగు చేస్తున్నామని చెప్పారు. పీపీపీ విధానంలో మంగళగిరి – తెనాలి ఫోర్ లైన్ రోడ్డును చేపట్టామని తెలిపారు. వరదల సమయంలో మహానాడు కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరకుండా రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో ఓటమి తనలో కసిని పెంచిందని, ఐదేళ్లు కష్టపడి ప్రజల మనసు గెలుచుకుని భారీ మెజారిటీతో విజయం సాధించానని లోకేశ్ అన్నారు. నిరుపేదలకు తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు అందజేశామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, పట్టుదల, నిబద్ధతతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మంగళగిరి అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యేగా తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల సహకారంతో మంగళగిరిని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.