జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా భారత్ సిమెంట్స్ లిమిటెడ్ (డీబీసీఎల్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.793.34 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడిపై 2011లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా డీబీసీఎల్ ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చామని ఈడీ తెలిపింది. డీబీసీఎల్ గతంలో హైదరాబాద్‌లో రూ. 377.26 కోట్లతో కొనుగోలు చేసిన భూమిని అటాచ్ చేశామని వివరించింది.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పలుకుబడిని ఉపయోగించి ఆయన కుమారుడు జగన్ మోహన్‌రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్‌కు పెద్ద ఎత్తున ఈక్విటీ, రుణాలను సమీకరించినట్టు విమర్శలున్నాయి. భారతీ సిమెంట్స్ షేర్లను ఒక్కో దానిని రూ. 10 చొప్పున నాలుగున్నర కోట్ల వాటాలను జగన్, ఆయన కంపెనీలు తీసుకున్నాయి. అందులోని మిగతా షేర్లను దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ వంటి వారు ఒక్కో షేరును రూ. 94 నుంచి రూ. 175 పెట్టి కొనుగోలు చేయడంతో అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత కూడా దాల్మియా సిమెంట్స్ 2 లక్షల షేర్లను రూ. 1,440 ధరతో కొనుగోలు చేసింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు సీబీఐ గుర్తించి కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఇవే అభియోగాలతో డీబీసీఎల్ ఆస్తుల తాత్కాలిక జప్తునకు ఈడీ ఆదేశాలు జారీ చేసింది.