AP

మాజీ మంత్రి కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు .. నేడు కోర్టు ముందుకు..

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను ఈరోజు వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో అరెస్టు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరుకు తీసుకువచ్చారు.

 

జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన్ను ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. కిలోమీటరు దూరంలోనే అన్ని వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. మైనింగ్ అక్రమ తరలింపు కేసులో కాకాణిని పోలీసులు విచారిస్తున్నారు.

 

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరాలు వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కాకాణి A4గా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.

 

విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం కాకాణి ప్రయత్నాలు చేశారు. అయితే, హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ ఆయనకు నిరాశ ఎదురవడంతో పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేందుకు వివిధ రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటూ వచ్చారు.