AP

రప్పా రప్పా వ్యాఖ్యలు..! పేర్ని నానిపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసు నమోదు..

వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని రప్పా రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన తీరు మార్చుకోలేదు. ఇటీవల పామర్రులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని.. ‘చీకట్లో కనుసైగ చేస్తే రెండో కంటికి తెలియకుండా వేసేయాలి.. తెల్లారగానే వెళ్లి పరామర్శించాలని’ అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

 

పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలపై శనివారం గుడివాడలో కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. ఇరువర్గాల రాళ్ల దాడితో నిన్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. పెడన కార్యకర్తల సమావేశానికి ముందు పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

 

ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చిన పేర్ని నాని.. పెడన కార్యకర్తల సమావేశంలో అంతకు ముందు పామర్రు సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే.. తాను చెప్పాలనుకుంటే పట్టపగలే వేసేయమంటానని, అరేయ్, ఒరేయ్ అంటూ కూటమి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్రలను కించపరిచేలా మాట్లాడారు.

 

ఇప్పటికే హింస, వర్గ వైషమ్యాలను ప్రోత్సహిస్తున్నారనే కారణంతో కూటమి నేతల ఫిర్యాదుతో నిన్న మచిలీపట్నం ఆర్ పేట పోలీస్ స్టేషన్, విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో పేర్ని నానిపై కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు పేర్ని నానిపై పామర్రులోనూ పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. హింసను ప్రేరేపించేలా నాని మాట్లాడుతున్నారని పామర్రు సీఐ శుభకర్ కు వల్లూరుపల్లి గణేశ్ తదితరులు ఫిర్యాదు అందజేశారు. పేర్ని నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ నేతలు కోరారు.