AP

త్వరలో డీజీపీ చేతికి.. ‘ఆడుదాం ఆంధ్రా’ విజిలెన్స్ రిపోర్ట్..

వైపీసీ ఫైర్‌బ్రాండ్ రోజా ఎక్కడ? వైసీపీ సమావేశాలకు ఎందుకు దూరమవుతున్నారు? నెక్ట్స్ టార్గెట్ ఆమేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాటికి రోజా గురించి క్లియర్ పిక్చర్ రానున్నట్లు తెలుస్తోంది. అసలు మేటరేంటి? అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేద్దాం.

 

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తైంది. వారం రోజుల్లో డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. విచారణలో అధికారులు కీలక విషయాలు గుర్తించారు. నాసిరకం స్పోర్ట్స్ కిట్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. విజేతలుగా వైసీపీ కార్యకర్తలను ప్రకటించినట్లు గుర్తించారు. అయితే ఈ పోటీలలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ అప్పటి మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

 

వైసీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల్లో ‘ఆడుదాం ఆంధ్ర’ ఒకటి. 2023 డిసెంబరులో ఘనంగా ప్రారంభమైంది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రకరకాల పోటీలు నిర్వహించారు. వాటిలో క్రికెట్‌, వాలీబాల్‌, కబడీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ వంటివి ఉన్నాయి. తొలుత గ్రామ, వార్డు స్థాయిలో ఆటల పోటీలు జరిగాయి. 10 వేలు చొప్పున నిధులు కేటాయించింది ప్రభుత్వం.

 

2024 జనవరి మొదటివారం మండల స్థాయి, నెలాఖరున మున్సిపాలిటీ స్థాయిలో పోటీలు నిర్వహించింది. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా స్థాయిలో రకరకాల ఆటలు నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. మొన్నటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యులు మంత్రిని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటన చేశారు.

 

చివరకు 45 రోజల్లో విచారణ పూర్తి చేసింది విజిలెన్స్. వచ్చేవారం డీజీపీకి నివేదిక అందనుంది. ఆటల కోసం ప్రతీ మండలం, మున్సిపల్‌, నియోజకవర్గానికి సంబంధించి 25 వేల చొప్పున నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు 81 లక్షలు, తిరుపతి జిల్లాకు 83 లక్షలు వచ్చాయి.

 

ఆయా ఆటలకు సంబంధించి శాప్‌ ఆధ్వర్యంలో కిట్లు కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేశారు. ఆయా కిట్లు నాసిరకంగా ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికితోడు నిధులు దుర్వినియోగమైనట్లు విమర్శలు లేకపోలేదు. ఆరోపణల నేపథ్యంలో చివరకు అసెంబ్లీ వేదికగా క్రీడా శాఖమంత్రి రాం ప్రసాద్‌రెడ్డి ఓ ప్రకటన చేశారు.

 

తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆటగాళ్లకు పంపిణీ చేసిన బ్యాట్లు, బాల్స్‌, షటిల్‌ బ్యాట్‌లు, టీ షర్టులు ఇతరత్రా వస్తువులు నాణ్యత లోపించినట్లు తేలింది. ఒకసారి వాడిన కిట్లు, మరోసారి పనికి రాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు విజిలెన్సు దృష్టికి తెచ్చారు.

 

విజేతలుగా వైసీపీ కార్యకర్తలను ప్రకటించారని, వారిలో చాలామంది బహుమానం ఇవ్వలేదని సమాచారం. విజిలెన్స్ రిపోర్టు రెడీ కావడంతో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై సభలో చర్చించనున్నారు. ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. అందులో ఎంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు బుక్కవుతారో చూడాలి.