AP

అమిత్ షాతో ఆ అంశాలపై చంద్రబాబు చర్చలు..!

అమిత్ షా- చంద్రబాబు మధ్య చర్చలు సారాంశం ఏంటి? నీటి ప్రాజెక్టులతోపాటు రాజకీయ అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చాయా? వీటిపై దాదాపు ముప్పావు గంటపాటు భేటీ జరిగిందా? ఇరువురు నేతల మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి? మరో గవర్నర్ పదవి టీడీపీకి ఇవ్వాలని బీజేపీ భావిస్తోందా? అవుననే సంకేతాలు హస్తినలో చక్కర్లు కొడుతున్నాయి.

 

ఎన్డీఏ బలోపేతంలో దిశగా బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. 2029లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు కావాల్సిన సహాయం చేస్తోంది. అంతేకాదు కీలక పదవుల్లో భాగస్వామ్య పక్షాలకు ప్రయార్టీ ఇస్తోంది. కేవలం మంత్రి పదువులు మాత్రమే కాకుండా గవర్నర్ పదవులను సైతం ఇస్తోంది.

 

ఇప్పటికే గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును నియమించారు. రెండురోజుల టూర్‌లో భాగంగా హస్తినకు వెళ్లిన సీఎం చంద్రబాబు మంగళవారం హోంమంత్రి అమిత్ షాతో దాదాపు 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. రేపో మాపో మోదీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

 

సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి పదవులను ఆశించినట్టు ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పదవులకు బదులు గవర్నర్ పోస్టు ఇస్తామని కమలం నేతల నుంచి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. ఇప్పటికే గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు అవకాశం కల్పించింది బీజేపీ.

 

మరో గవర్నర్ పదవిపై టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ ఆ ఛాన్స్ ఇస్తే.. ఆ పదవి ఎవరికి ఇస్తారు అనేది పార్టీలో చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైంది. ఉత్తరాంధ్రకు కేంద్ర మంత్రి పదవి, గవర్నర్ ఇచ్చారని అంటున్నారు. ఈసారి రాయలసీమకు అవకాశం రావచ్చని అంటున్నారు.

 

ఎందుకంటే పార్టీ అవకాశం ఇస్తే పెద్దల సభకు వెళ్లాలని ఉందంటూ గతంలో మనసులోని మాట బయటపెట్టారు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఈ రేసులో ఆయన లేనట్టేనని అంటున్నారు. సీమ నుంచి టీడీపీ నేతను ఎంపిక చేయవచ్చని అంటున్నారు. బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం రావచ్చని అంటున్నారు.

 

టీడీపీలో కీలక పదవులు నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చింది. ఆయన కొడుకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కేఈ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. ఒకవేళ గవర్నర్ ఛాన్స్ ఇస్తే బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎన్డీయే ప్రభుత్వం కీలకంగా ఉన్న టీడీపీకి పెద్ద పీఠ వేస్తోంది బీజేపీ హైకమాండ్.