ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు… రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో మీరంతా చూస్తున్నారు…. చంద్రబాబు గారి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి… మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేశ్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, అంతకు అంత వడ్డీతో కలిపి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగువారిని ప్రపంచపటంలో నిలిపిన చంద్రబాబు
తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, దానిని నిలబెట్టింది ఎన్టీ రామారావు గారని లోకేశ్ పేర్కొన్నారు. తెలుగువారిని ప్రపంచపటంలో నిలిపింది చంద్రబాబు అని, ఆయనే మన బ్రాండ్ అని అన్నారు. ఐటీ గురించి కొందరు విమర్శించినా, చంద్రబాబు ఇంజినీరింగ్ కళాశాలలను స్థాపించినప్పుడు విమర్శించినా, ఈ రోజు అదే కంప్యూటర్లతో తెలుగువారు ప్రపంచాన్ని శాసిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది తెలుగు ప్రవాస భారతీయులు ఉండగా, ఫార్ ఈస్ట్‌లో మాత్రమే 3 లక్షల మంది ఉన్నారని, సింగపూర్ సమావేశానికి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇతర ఫార్ ఈస్ట్ దేశాల నుండి పెద్ద ఎత్తున తెలుగువారు తరలిరావడం మన శక్తికి నిదర్శనమని లోకేశ్ వ్యాఖ్యానించారు.
సీబీఎన్ బ్రాండ్ తో పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల సృష్టి
ప్రతి దేశానికి, వస్తువుకు ఒక బ్రాండ్ ఉన్నట్లే, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంటే సీబీఎన్ బ్రాండ్ అని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ బ్రాండ్‌తో ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే తమ ప్రయత్నాలకు ఎన్ఆర్ఐల సహకారం అవసరమని కోరారు. సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుని నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని, వేగంగా వ్యాపారం చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామని తెలిపారు.
దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, భూములు వంటి అపారమైన వనరులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, ఇది పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని, ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి విద్యాసంస్థలు వచ్చాయని, బిట్స్ పిలానీ త్వరలో రానుందని వెల్లడించారు.
“20 లక్షల ఉద్యోగాల కల్పన… ఇదే మన నినాదం… ఇదే మన విధానం” అని లోకేశ్ పునరుద్ఘాటించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో జన్మభూమి కార్యక్రమానికి ఎన్నారైలు అండగా నిలిచారని, ఇప్పుడు జీరో పావర్టీ లక్ష్యంగా చంద్రబాబు తలపెట్టిన పీ4 (P4) కార్యక్రమంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలన్నదే చంద్రబాబు గారి కోరిక అని, ఆరోగ్యవంతమైన, సంపన్నవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పీ4 లో మార్గదర్శిగా చేరి పేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్
ఆంధ్రప్రదేశ్‌లో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ నడుస్తోందని, కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇతర దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) కంపెనీలను కూడా ప్రోత్సహిస్తామని, ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తున్నాయని పేర్కొన్నారు. టీసీఎస్‌లో 35 శాతం తెలుగువారు పనిచేస్తున్నారని, అందుకే ఏపీకి వస్తున్నామని టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారని లోకేశ్ గుర్తు చేశారు.
శాసనసభ్యుల్లో 50 శాతం మంది కొత్తవారు ఉన్నారని, మంత్రివర్గంలో 17 మంది కొత్తవారు ఉన్నారని, అందరూ సహకరిస్తే ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ 1గా తయారుచేస్తామని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని లోకేశ్ అన్నారు. సింగపూర్‌లో ఇంతమంది తెలుగువారు రావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని, ఇక్కడున్న వారిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన కనిపిస్తోందని ఆయన ప్రశంసించారు. ఏపీఎన్‌ఆర్‌టీ 2.0ని ప్రారంభించామని, ఎన్ఆర్ఐలకు ఎటువంటి సమస్యలున్నా ఏపీఎన్‌ఆర్‌టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చివరగా, పహల్గాం దాడిలో వీరమరణం పొందిన మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్‌కు నివాళులర్పించాలని మంత్రి లోకేశ్విజ్ఞప్తి చేశారు.