ఏపీలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. విశాఖపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నిన్న నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాగబాబు మాట్లాడారు.
“కూటమి ఏర్పాటు, ఎన్నికల్లో విజయానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కృషి చేశారు. పదవుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తి చెందొద్దు. ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని ఆశించాను. సీట్ల పంపకాల్లో కుదరకపోవడంతో పవన్ చెప్పగానే క్షణం ఆలోచించకుండా తప్పుకున్నా. దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు వస్తాయి. కూటమిలోని పార్టీ నేతలతో అపార్థాలు తలెత్తితే సమన్వయ కమిటీ చూసుకొంటుంది. కార్యకర్తలు స్పందించవద్దు” అని నాగబాబు అన్నారు.
ఈ సమావేశంలో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పాల్గొన్నారు.