కష్టపడి పనిచేసిన వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కార్యకర్తలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతామని వివరించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో-ఆర్డినేటర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో తాము చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పుకోలేక నష్టపోయామని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. ఈ నెలలో అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని, మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులను మోసం చేశారని ఆరోపించారు. రైతు భరోసా పేరుతో అన్నదాతలను వంచించారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి మొత్తం రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు.