AP

తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర..!

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 3 వేల ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో భాగంగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.

 

ఈ మేరకు నియామకాలకు అనుమతి కోరుతూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2013 నుంచి సంస్థలో కండక్టర్ల నియామకాలు జరగకపోవడంతో తాత్కాలిక సిబ్బందితోనే సేవలు కొనసాగిస్తున్నారు. మరోవైపు, ప్రతి సంవత్సరం ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండటంతో ఉన్న సిబ్బందిపై పనిభారం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు కొత్త నియామకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు.

 

వాస్తవానికి డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యంగా కండక్టర్ పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు అందిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.