ఏపీ పర్యాటక రంగాన్ని జాతీయ స్థాయిలో మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, పురాతన శిల్పకళ అన్నట్టుగా ఉన్న ఏపీలో ప్రతి జిల్లా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ శక్తిని ప్రపంచానికి చూపించేందుకు, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలిపేందుకు ఏపీ ప్రభుత్వం తాజా ప్రణాళికలతో ముందుకు వెళ్లింది. దాదాపు రూ. 280 కోట్ల విలువైన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టుల్లో లేపాక్షి, లంబసింగి, నాగార్జునకోండ, అమరావతి వంటి చారిత్రక, ప్రకృతి, సాంస్కృతిక కేంద్రాలు ముఖ్యంగా ఉన్నాయి.
లేపాక్షి కల్చరల్ సెంటర్ – రూ.103 కోట్లు
లేపాక్షి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది విజయనగర శిల్పకళ, వీరభద్ర ఆలయం, హనుమంతుడి అద్భుత శిల్పాలు. యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తింపు పొందే అవకాశమున్న ఈ ప్రదేశాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ. 103 కోట్లతో లేపాక్షి కల్చరల్ సెంటర్ ప్రతిపాదించారు. దీనివల్ల సాంప్రదాయ కళలు, హస్తకళలు, శిల్ప సంపదను విస్తృత స్థాయిలో ప్రోత్సహించవచ్చు. అంతేకాదు, ఇక్కడ పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు, ప్రదర్శనశాలలు, మ్యూజియంలు కూడా ఏర్పడే అవకాశముంది.
లంబసింగి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ – రూ. 99.87 కోట్లు
ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ గా పేరుగాంచిన లంబసింగిని మరో లెవెల్‌కి తీసుకెళ్లేందుకు రూ. 99.87 కోట్ల ప్రణాళిక సిద్ధం చేశారు. లంబసింగి లోని పచ్చటి అడవులు, చలికాలం లో పడే మంచు, కాఫీ తోటలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ద్వారా నైట్ స్టే సౌకర్యాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్ మార్గాలు, స్థానిక ఉత్పత్తుల మార్కెట్లను కూడా అభివృద్ధి చేస్తారు. దీని వల్ల లంబసింగి దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు మరింత దగ్గరవుతుంది.
నాగార్జున కొండ టెంట్ సిటీలు.. రూ. 77.32 కోట్లు
నాగార్జునసాగర్ జలాశయం మధ్యలోని నాగార్జునకోండ చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ పర్యాటక వసతులను విస్తరించేందుకు రూ. 77.32 కోట్లతో టెంట్ సిటీలు ప్రతిపాదించారు. నదీ తీరం వద్ద టెంట్‌డ్ అకామడేషన్, ఈకో ఫ్రెండ్లీ హట్‌లు, బోటింగ్ సౌకర్యాలు సందర్శకులకు చేరువకానుంది. బౌద్ధ చరిత్రను అనుభవిస్తూ, ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించే వీలుంటుంది.
అమరావతి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ – రూ. 100 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ కేంద్రంగా పేరు తెచ్చుకున్న అమరావతిలో ₹100 కోట్లతో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఇది వస్తే పర్యాటకులు బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక టెక్నాలజీతో అనుభవించే అవకాశం ఉంటుంది. వీఆర్ గ్యాలరీలు, ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు, బౌద్ధ కళా శిల్పాల ప్రదర్శనలుగా ఈ సెంటర్ ఉండనుంది.
విశాఖలో లలిత కళా అకాడమీ, విజయవాడలో సాహిత్య అకాడమీ
ఏపీ ప్రభుత్వం మరో వినూత్న ప్రతిపాదన చేసింది. విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ, విజయవాడలో సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయాలని కోరింది. దీని వల్ల రాష్ట్ర సాంస్కృతిక వైభవం జాతీయ స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతుంది. కళలు, సాహిత్యం, నాటకరంగానికి పెద్ద పీట వేయడానికి ఇవి కీలక వేదికలుగా నిలుస్తాయి.
కేంద్రం స్పందన.. పర్యాటక రంగంలో ఏపీ భవిష్యత్తు
కేంద్రానికి సమర్పించిన ఈ డీపీఆర్‌లు ఆమోదం పొందితే ఏపీలో పర్యాటక రంగానికి కొత్త ఊపిరి చేరుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించే పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఒకవైపు సాంస్కృతిక కేంద్రాలు, మరోవైపు ప్రకృతి వైభవం.. వీటిని సమన్వయం చేస్తూ ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రూ. 280 కోట్ల విలువైన ఈ ప్రణాళికలు ఆమోదం పొందితే, లేపాక్షి నుంచి లంబసింగి వరకు, నాగార్జునకొండ నుంచి అమరావతి వరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం కొత్త వెలుగులు చూస్తుంది. ఇక కేంద్రం ఎలా స్పందిస్తుందో, ఎప్పుడు ఆమోదం ఇస్తుందో అన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆతృత.