కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కార్యాలయం సిబ్బంది సదరు వ్యక్తి ఇచ్చి వెళ్లిన ఆ లేఖను తెరిచి చూశారు.
ఆ లేఖలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనకు రూ. 2కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని రాసి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలియజేశారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు.. సైలెంట్‌గా దర్యాప్తు చేసి, అల్లూరు మండలం ఇస్కపాళెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అలాగే వేమిరెడ్డి ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో పాటు అతని వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్‌పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావడం నిజమేనని అన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.