AP

అటవీశాఖ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి… పవన్ కల్యాణ్ ఫైర్..!

ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

“శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఘటనల్లో శాసనసభ్యుడు, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాను. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పాను.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం… చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని, ఇందుకు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒకటే అని, అరెస్టయిన 31వ రోజు పదవి కోల్పోయే చట్టం తీసుకురాబోతోంది.

 

‘మేము తప్పు చేసినా బాధ్యులను చేయమని రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నేను కూడా శాసనసభలో స్పష్టంగా చెప్పాం. నిబద్ధతతో, నియంత్రణతో విధులు నిర్వర్తిస్తున్నాం. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.