AP

ఏపీలో రూ. 53 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం..! ఏపీలో కొలువుల జాతర..!

ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ

వేగంగా పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలన్న ముఖ్యమంత్రి

ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు

రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం

ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు

నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు

బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం

రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో త్వరగా అనుమతులు ఇస్తున్నామని, అదే తరహాలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ కూడా అంతే వేగంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రూ. 53,922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతీ నెలా సమీక్షస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

ఈ ప్రాజెక్టుల్లో స్థితిగతులపై క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏ ప్రాజెక్టు అయినా ఆలస్యం అవుతుంటే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు.

 

రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అధికారులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు. మహింద్రా ఈవీ వాహనాల ఉత్పత్తి ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నానని, దీనికి అనుగుణంగా అధికారులూ కూడా స్పందించాలని ముఖ్యమంత్రి అన్నారు.

 

ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలదే ప్రధాన భూమిక

 

వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలే కీలకమని, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలున్నాయని అన్నారు.

 

పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో స్థానికంగా ఉన్న మ్యాంగో ప్రాసెసింగ్ పరిశ్రమల వల్లే రైతులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా చూడగలిగామని అన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలలో ఈ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు లేవన్నారు.

 

బిజినెస్ సెంటర్ల తరహాలో ఎంఎస్ఎంఈ పార్కులతో ఎకో సిస్టం

 

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన ప్రాంతాల్లో మినహా మిగతా నియోజకవర్గాల్లో 3 నెలల్లో ఈ పార్కులు అందుబాటులోకి రావాలన్నారు. ఈ పారిశ్రామిక పార్కులన్నీ బిజినెస్ సెంటర్లలా చేసి ఒక ఎకో సిస్టంను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు, భూ యజమానుల్ని కూడా ఈ పారిశ్రామిక పార్కుల్లో భాగస్వాములను చేయాలని సీఎం స్పష్టం చేశారు. తద్వారా వారికి ఆదాయం వచ్చేలా చేయాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో మెగా, మీడియం స్థాయిలో పారిశ్రామిక పార్కులను నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ఈ పారిశ్రామిక పార్కులకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను అనుసంధానించటంతో పాటు వాటికి ప్రామాణిక మార్గదర్శకాలను నిర్దేశించాలన్నారు.

 

పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆర్టీఐహెచ్ ద్వారా జరిగే కార్యకలాపాలను సమీక్షించాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని ఆటోనగర్ లలో రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలకు తదుపరి అనుమతులు రాకపోవటంపై సమీక్షించిన సీఎం దీనికి తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఏపీకి పరిశ్రమలు రావటం ముఖ్యమన్న సీఎం.. ఇంధన ఉత్పత్తి, ఐటీ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్ ఆధారిత వాల్యూ చైన్ పరిశ్రమల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. అలాగే ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్, కో-వర్కింగ్ స్పేస్ లను ఏర్పాటు చేయాలన్నారు.

 

మరోవైపు గత పాలకులు తిరుపతి వేంకటేశ్వరస్వామి ఏడుకొండల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారని, కొండను ఆనుకుని హోటల్ నిర్మాణానికి స్థలం కేటాయించిందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయంగా స్థలం చూపామని అన్నారు. దీనిపై కొందరు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, సీఎస్ కె.విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

10వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టులు

 

1. మథర్ డెయిరీ లిమిటెడ్ రూ.427 కోట్లు పెట్టుబడులు, 180 మందికి ఉద్యోగాలు, చిత్తూరు జిల్లా.

2. ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.786 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు, చిత్తూరు జిల్లా.

3. అపోలో టైర్స్ రూ.1110 కోట్ల పెట్టుబుడులు, 500 మందికి ఉద్యోగాలు, చిత్తూరు జిల్లా.

4. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.400 కోట్ల పెట్టుబుడలు, 300 మందికి ఉద్యోగాలు, తిరుపతి.

5. హెచ్‌ఎఫ్‌సీఎల్ రూ.1197 కోట్ల పెట్టుబడులు, 870 మందికి ఉద్యోగాలు, మడకశిర.

6. వరాహా ఆక్వా ఫార్మ్స్ రూ.32 కోట్ల పెట్టుబడులు, 3,500 మందికి ఉద్యోగాలు, అనకాపల్లి.

7. జె.కుమార్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.237 కోట్ల పెట్టుబడులు, 5000 మందికి ఉద్యోగాలు, విశాఖపట్నం.

8. అలీప్ సంస్థ, రూ.45 కోట్ల పెట్టుబడులు, 2,500 మందికి ఉద్యోగాలు, చిత్తూరు.

9. ఇఫ్కో కిసాన్ సెజ్ రూ.870 కోట్ల పెట్టుబడులు, 25,000 మందికి ఉద్యోగాలు, నెల్లూరు.

10. ధీరూభాయ్ అంబానీ గ్రీన్ టెక్ పార్క్ రూ.1843 కోట్ల పెట్టుబడులు, 19,000 ఉద్యోగాలు, కృష్ణపట్నం.

11. ఎన్‌.కామ్ వైజాగ్ హోటల్ రూ.178 కోట్ల పెట్టుబడులు, 250 మందికి ఉద్యోగాలు, భోగాపురం.

12. మంజీరా హాస్పిటాలిటీ, రూ.276 కోట్ల పెట్టుబడులు, 225 మందికి ఉద్యోగాలు, అమరావతి.

13. శ్రీ వెంకటేశ్వర లాడ్జి రూ.96 కోట్ల పెట్టుబడులు, 300 మందికి ఉద్యోగాలు, మంత్రాలయం.

14. సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) రూ.1500 కోట్ల పెట్టుబడులు, 950 మందికి ఉద్యోగాలు, కొలిమిగుండ్ల, నంద్యాల జిల్లా.

15. సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రూ.800 కోట్లు, 200 మందికి ఉద్యోగాలు, రామగిరి, ముత్తవకుంట్ల, సత్యసాయి జిల్లా.

16. సెరెంటికా రెన్యూవబుల్స్ ఆఫ్ ఇండియా రూ.2000 కోట్లు పెట్టుబడులు, 320 మందికి ఉద్యోగాలు, అనంతపురం.

17. సెరెంటికా రెన్యూవబుల్స్ ఆఫ్ ఇండియా రూ.2,400 కోట్ల పెట్టుబడులు, 380 మందికి ఉద్యోగాలు, కర్నూలు.

18. హెక్సా ఎనర్జీ బీహెచ్ ఫైవ్ ప్రైవేట్ లిమిటెడ్, రూ.1,200 కోట్ల పెట్టుబడులు, 400 మందికి ఉద్యోగాలు, కడప.

19. రెఫెక్స్ సోలార్ ఎస్పీవీ ఫైవ్ లిమిటెడ్, రూ.480 కోట్ల పెట్టుబడులు, 345 మందికి ఉద్యోగాలు, శ్రీ సత్యసాయి జిల్లా.

20. బ్రైట్ ఫ్యూచర్ పవర్ లిమిటెడ్, రూ.3,286 కోట్ల పెట్టుబడులు, 440 మందికి ఉద్యోగాలు, అనంతపురం.

21. నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్, రూ.15,455 కోట్ల పెట్టుబడులు, 8,400 మందికి ఉద్యోగాలు, పాడేరు.

22. చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, రూ.15,050 కోట్ల పెట్టుబడులు, 8,400 మందికి ఉద్యోగాలు, కడప.

23. సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ రూ.1595 కోట్ల పెట్టుబడులు, 2,170 మందికి ఉద్యోగాలు, నాయుడుపేట.

24. హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.586 కోట్ల పెట్టుబడులు, 613 మందికి ఉద్యోగాలు, కుప్పం.

25. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, రూ.485 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు, అనకాపల్లి.

26. అదాని విల్మర్ లిమిటెడ్, రూ.578 కోట్లు, 285 మందికి ఉద్యోగాలు, నెల్లూరు జిల్లా.

27. టైరోమెర్ టెక్నాలజీ లిమిటెడ్, రూ.85 కోట్లు పెట్టుబడులు, 120 మందికి ఉద్యోగాలు, చిత్తూరు.

28. ర్యామ్ శీ బయో ప్రైవేట్ లిమిటెడ్, రూ. 356 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు, కడప జిల్లా.

29. శ్రీ సర్వారాయా షుగర్స్ లిమిటెడ్, రూ.161 కోట్ల పెట్టుబడులు, 189 మందికి ఉద్యోగాలు, కోనసీమ.

30. పట్టాభి ఆగ్రోఫుడ్స్, రూ.408 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగాలు, కాకినాడ.