AP

ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై వేటు..!

దేవాదాయ శాఖలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సహాయ కమిషనర్ (ఏసీ) కె. శాంతిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆమెపై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో నిర్బంధ ఉద్యోగ విరమణ (కంపల్సరీ రిటైర్మెంట్) చేయించాలని శాఖాపరంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.

గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు కె. శాంతి ఇటీవల వివరణ సమర్పించారు. అయితే, ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఉన్నతాధికారులు భావించారు. ముఖ్యంగా, మొదటి భర్త ఎం. మదన్‌మోహన్‌కు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే పి. సుభాష్‌ను రెండో వివాహం చేసుకోవడం ఏపీ సివిల్ సర్వెంట్ నిబంధనలకు (రూల్ 25) విరుద్ధమని దేవాదాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తన వివరణలో, చాలాకాలంగా మొదటి భర్తకు దూరంగా ఉంటున్నందునే రెండో వివాహం చేసుకున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను అధికారులు అంగీకరించలేదు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్‌గా, అలాగే విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల దేవాదాయ శాఖ అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆమె నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని, దేవాదాయ భూముల పరిరక్షణలో విఫలమయ్యారని, ఆలయాలకు నష్టం కలిగించేలా వ్యవహరించారని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణల కారణంగానే ఆమెను గత ఏడాది ఆగస్టులో సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. తాజాగా ఆమె ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో, సర్వీస్ నుంచి నిర్బంధంగా పదవీ విరమణ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.