గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలుగా అంతుచిక్కని జ్వరాలతో సంభవిస్తున్న వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు, గ్రామంలో పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో ప్రత్యేక వైద్య బృందాలను గ్రామానికి పంపి, ప్రతి ఒక్కరికీ 42 రకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సోమవారం నాటికి గ్రామ ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని, అనారోగ్యం తీవ్రంగా ఉన్నవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఎయిమ్స్ సహా కేంద్ర బృందాలను, అంతర్జాతీయ నిపుణుల సహాయాన్ని కూడా తీసుకోవాలని సూచించారు.
మెలియోయిడోసిస్‌గా అనుమానం
ప్రస్తుత కేసులను పరిశీలిస్తే, ఇవి ‘మెలియోయిడోసిస్’ లక్షణాలుగా ఉన్నాయని వైద్యాధికారులు సీఎం వద్ద అనుమానం వ్యక్తం చేశారు. రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామని, 72 గంటల్లో తుది నివేదికలు వస్తాయని తెలిపారు. భూమి, నిల్వ ఉన్న నీటిలో ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువని వారు వివరించారు.
మంత్రుల పర్యటన.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
మరోవైపు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. మరణాలకు కలుషిత నీరు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా తురకపాలెంను సందర్శించారు. మరణాల వెనుక వైద్యపరమైన నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేసేందుకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ అట్టాడ సిరి నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మెలియోయిడోసిస్ జ్వరాలు అనే ప్రచారం జరుగుతున్నా, రక్త పరీక్షల ఫలితాలు వచ్చాకే దానిని నిర్ధారించగలమని మంత్రి తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని, సురక్షిత తాగునీటిని అందించాలని అధికారులు చర్యలు చేపట్టారు