AP

ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముందే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ..!

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు సమాచారం.

 

గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. ఆదివారం కూడా ముఖ్య అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించారు. మొదటి విడత బదిలీల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

 

ఎవరెవరు బదిలీ కావొచ్చు?

 

ప్రాథమికంగా సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాలో శాఖాధిపతులు, జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు (ఎస్పీలు) వరుసగా బదిలీ అయ్యే అవకాశం ఉంది. తితిదేలోని కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు కూడా మార్పులు ఉండవచ్చు. అలాగే, సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు కూడా బదిలీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. విద్యుత్ పంపిణీ సంస్థల్లోనూ బదిలీలు ఖాయమని భావిస్తున్నారు.

 

పనితీరు ఆధారంగా మార్పులు

 

కలెక్టర్ల పనితీరు ఆధారంగా ఇప్పటికే రెండు, మూడు విడతలుగా రహస్యంగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాటిని పరిశీలించి తుది జాబితా రూపొందించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇటీవల కొన్ని పథకాల అమలులో అంతరాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, కార్యదర్శుల పనితీరు వంటి అంశాలను పరిశీలించిన అనంతరం మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

సచివాలయం నుంచే ప్రారంభం

 

ఈ బదిలీల ప్రక్రియ రాష్ట్ర సచివాలయం స్థాయి అధికారుల నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత జిల్లాల అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ మార్పులు పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.