AP

ఎరువులు అక్రమంగా నిల్వచేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయండి: మంత్రి నాదెండ్ల..

రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6ఏ కేసులు కాకుండా, నేరుగా పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

జిల్లాలో యూరియా కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా కథనాలు, రాజకీయ ప్రత్యర్థుల దుష్ప్రచారం కారణంగా రైతులు ఆందోళనకు గురై అవసరానికి మించి ఎరువులను కొనుగోలు చేస్తున్నారని, దీనివల్లే అక్కడక్కడా తాత్కాలిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సీజన్‌లో జిల్లాకు 33,762 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని, మరో రెండు రోజుల్లో అదనంగా 2,200 టన్నులు అందుబాటులోకి వస్తాయని గణాంకాలతో సహా తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధికంగానే ఎరువులను అందించామని గుర్తుచేశారు.

 

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తూ, యూరియా కొరతపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రైతు సంక్షేమంపై వైఎస్‌ఆర్‌సీపీకి చిత్తశుద్ధి ఉంటే, వారి హయాంలో కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.1674 కోట్ల బకాయిలను ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ బకాయిలన్నీ చెల్లించి రైతులను ఆదుకుందని తెలిపారు.

 

ఎరువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 29 చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పటిష్టం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే 12 కేసులు నమోదు చేశామని, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను బలోపేతం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, జిల్లావ్యాప్తంగా 530 పంపిణీ కేంద్రాల ద్వారా పారదర్శకంగా ఎరువులు అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. మండల స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, సమస్యల పరిష్కారం కోసం అధికారుల ఫోన్ నంబర్లను రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించారు.

 

ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, సొంగా రోషన్‌ కుమార్‌, చిర్రి బాలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని, కొందరు కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.