ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించడం వివాదంగా మారింది. ఈ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. చట్టపరమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం చిత్రాన్ని కార్యాలయాల్లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
వివరాల్లోకి వెళితే.. వై. కొండలరావు అనే విశ్రాంత రైల్వే ఉద్యోగి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటోను పెట్టేందుకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, చట్టపరమైన నిబంధనలు లేవని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫొటోల ప్రదర్శనపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించే వరకు, కార్యాలయాల నుంచి పవన్ కల్యాణ్ ఫొటోలను వెంటనే తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు.
ఈ వ్యాజ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ను కూడా ప్రతివాదుల జాబితాలో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.