AP

తురకపాలెం మరణాల కేసులో కీలక మలుపు..! అసలు కారణం అదేనా..?

గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర కలకలం రేపిన వరుస మరణాల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ విషాద ఘటనలకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. కలుషితమైన సెలైన్ వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

 

గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఈ ఆర్ఎంపీ వద్దకే వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. వారికి కలుషితమైన సెలైన్లతో పాటు, మోతాదుకు మించి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్న తర్వాతే బాధితుల ఆరోగ్యం మరింత విషమించిందని, ఆ తర్వాతే వారిని ఆస్పత్రులకు తరలించారని కుటుంబ సభ్యులు దర్యాప్తు బృందాలకు వివరించారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే విజయలక్ష్మి, బుధవారం ఆర్ఎంపీ క్లినిక్‌పై ఆకస్మిక తనిఖీలు చేశారు.

 

తనిఖీల్లో పలు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులను స్వాధీనం చేసుకుని, క్లినిక్‌ను సీజ్ చేశారు. అనంతరం ఆర్ఎంపీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆమె తెలిపారు. పరిధి మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

 

తురకపాలెం మరణాల వెనుక ‘మెలియోయిడోసిస్’ అనే అరుదైన ఇన్ఫెక్షన్ ఉండొచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. గతంలో 2023 మే నెలలో చెన్నైలోని ఓ దంత వైద్యుడి క్లినిక్‌లో ఇలాంటి ఘటనే జరిగిందని, కలుషిత ద్రావణాల వల్ల ఎనిమిది మంది ‘న్యూరో మెలియోయిడోసిస్’ అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో మరణించారని వెల్లూరు సీఎంసీ నిపుణులు నిర్ధారించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తురకపాలెంలోనూ కలుషిత సెలైన్ వాడకంపై అనుమానాలు బలపడుతున్నాయి.

 

ప్రస్తుతం గ్రామంలో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) బృందం మంగళవారం గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించింది. ఈ బృందంలో డాక్టర్ హేమలతతో పాటు రాష్ట్ర ఆరోగ్యశాఖ జేడీ డాక్టర్ మల్లీశ్వరి, ఇతర అధికారులు ఉన్నారు. గుంటూరు జీజీహెచ్‌తో పాటు, తొలుత ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తించిన ప్రైవేటు వైద్యుడు కల్యాణ్ చక్రవర్తిని కలిసి బృందం వివరాలు సేకరించింది.