AP

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ భారీ గుడ్ న్యూస్..! ఏపీపీఎస్సీ నుంచి 5 నోటిఫికేష‌న్లు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మంగళవారం ఐదు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.

 

ఈ నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్‌మెన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), హార్టికల్చర్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. వీటిలో రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఒక బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు ఉన్నాయి. వీటితో పాటు అటవీ శాఖలో 13 డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో మూడు ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే, ఉద్యానవన శాఖలో రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన జారీ అయింది. ఇలా 21 పోస్టుల‌తో 5 ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్లు విడుద‌ల‌య్యాయి.

 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ గడువును కూడా ప్రకటించింది. జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్లకు అక్టోబర్ 7వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఇక మిగిలిన మూడు నోటిఫికేషన్లకు (డ్రాఫ్ట్స్‌మెన్, ఏఈఈ, హార్టికల్చర్ ఆఫీసర్) దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 8వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు కమిషన్ అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.