గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో అసలు హాయ్‌ల్యాండ్‌లో ఏం జరిగిందో బయటపెట్టకుండా నిజాలు దాస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ మూల్యాంకనం చేయనప్పుడు, 65 రోజుల పాటు ఏం చేశారని కమిషన్‌ను సూటిగా ప్రశ్నించింది. వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఏపీపీఎస్సీ ఆడుకుంటోందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై గురువారం తుది విచారణ జరిగింది. జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హాయ్‌ల్యాండ్‌లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయని, అలాంటప్పుడు అక్కడ మూల్యాంకనం జరగలేదని ఎలా చెబుతారని ప్రశ్నించింది.
విచారణ సందర్భంగా ఏపీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ, హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరగలేదని, ఏపీపీఎస్సీ కార్యాలయం, రెండు ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే జరిగిందని తెలిపారు. అప్పటి కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు జరుగుతోందని, నివేదిక వచ్చేవరకు ఆగాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు కూడా హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిగిందనడానికి ఆధారాలు లేవని, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని వాదించారు.
అయితే, ఎంపికకాని అభ్యర్థుల తరఫు న్యాయవాది వాదిస్తూ, హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరగడం వాస్తవమని, అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకే ఏపీపీఎస్సీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఏపీపీఎస్సీ, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫు వాదనలు ముగియడంతో మిగిలిన వారి వాదనల కోసం విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. 2018 నోటిఫికేషన్‌కు సంబంధించి మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, ఆటో డ్రైవర్లు, గృహిణులతో జవాబు పత్రాలు దిద్దించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.


 
         
							 
							