AP

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆర్‌ఐ, సర్వేయర్..

వనపర్తి జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సి. వాసు, మండల సర్వేయర్ నవీన్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.40,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన బంధువులకు చెందిన భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ జారీ చేయాలని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే, విచారణ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆర్‌ఐ వాసు, సర్వేయర్ నవీన్ రెడ్డి బాధితుడిని లంచం డిమాండ్ చేశారు.

 

అధికారుల తీరుతో విసిగిపోయిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, పక్కా ప్రణాళికతో వల పన్నింది. బాధితుడు డబ్బులు ఇస్తుండగా అధికారులు దాడులు చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

 

పట్టుబడిన ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం కోసం వేధిస్తే, తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు గానీ, వాట్సప్ ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఏసీబీ అధికారులు సూచించారు