AP

కిలో టమాటా ఒక్క రూపాయి… కర్నూలు జిల్లాలో రైతుల ఆగ్రహం..

కంటికి రెప్పలా కాపాడుకున్న పంటకు కనీస ధర కూడా దక్కకపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో ధర కేవలం రూపాయికి పడిపోవడంతో ఆగ్రహించిన రైతులు, తాము పండించిన టమాటాలను రోడ్డుపై పారబోసి తీవ్ర నిరసన చేపట్టారు. టమాటాలతో నిండిన బుట్టలను రహదారిపై కుమ్మరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

 

ఈ నిరసన కారణంగా పత్తికొండలోని గుత్తి-మంత్రాలయం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ఎప్పటినుంచో నిర్మాణంలో ఉన్న టమాటా జ్యూస్ ఫ్యాక్టరీని వెంటనే పూర్తి చేయాలని కోరారు.

 

తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రైతులతో చర్చలు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. అష్టకష్టాలు పడి పండించిన పంటకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.