AP

60 ఏళ్ల దాంపత్యం: భర్త మరణించిన కొద్ది గంటల్లోనే భార్య మృతి.. నంద్యాలలో విషాదం

ఇద్దరు వేర్వేరు మనుషుల్ని ఒకటి చేసి, పరిపూర్ణమైన జీవితాన్ని అందించే వివాహ బంధం మరణంలో కూడా వీడలేదు. నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన 85 సంవత్సరాల ఆరువేటి లక్ష్మీనారాయణ, వెంకట లక్ష్మమ్మ దంపతుల దాంపత్య జీవితం మరణంలో కూడా కలిసే ముగియడం అందరినీ కంటతడి పెట్టించింది. దాదాపు 60 ఏళ్ల క్రితం వివాహం పేరుతో ఒక్కటైన ఈ పండు వృద్ధ జంట, తమ చివరి ప్రయాణాన్ని కూడా కలిసే కొనసాగించింది.

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీనారాయణ, వృద్ధాప్య సమస్యలతో ఆదివారం ఉదయం ఆకస్మిక మరణం చెందారు. అయితే, భర్త లక్ష్మినారాయణ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడాన్ని ఆయన భార్య వెంకట లక్ష్మమ్మ జీర్ణించుకోలేకపోయింది. అంతే, భర్త చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా హఠాన్మరణం చెందింది. చావులో కూడా జీవితాన్ని కలిసి పంచుకున్న ఈ వృద్ధ దంపతుల సంఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్ని కంటతడి పెట్టించింది.

కుటుంబ సభ్యులు తమ ఇంటి పెద్దలు ఇద్దరూ ఒకేసారి తుదిశ్వాస విడవడం చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారని, ప్రేమ, అనుబంధానికి నిదర్శనంగా వారి జీవితం నిలిచిందన్నారు. మరణంలోను భార్యభర్తలిద్దరూ వీడిపోలేదని చెప్పుకొచ్చారు. ఈ వృద్ధ దంపతుల మృతదేహాలకు గ్రామంలోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.