కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాలు చేసిన ప్రాథమిక విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోవడానికి, మంటల తీవ్రత ఇంతగా పెరగడానికి బస్సులోని లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పేలడమే ప్రధాన కారణంగా ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి.
బస్సు ముందుగా బైక్‌ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో పెట్రోల్ కారి మంటలు మొదలయ్యాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్లో దాదాపు 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలు (లిథియం లోహం) ఒక్కసారిగా పేలిపోవడం వల్ల మంటలు మరింత తీవ్రమై, భారీ శబ్దంతో ప్రయాణికుల కంపార్ట్‌మెంట్లోకి వేగంగా వ్యాపించాయని భావిస్తున్నారు.
మొబైల్ ఫోన్ల పేలుడు వల్ల మంటలు తీవ్రమై, లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉన్న బస్సు ముందు భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్న ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే బస్సు ముందు భాగంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ బృందాలు అంచనా వేశాయి. వాస్తవానికి, ప్రయాణికుల బస్సుల్లో వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరకులను రవాణా చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ తీవ్ర నష్టం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు.

