AP

కృష్ణా జలాలపై చంద్రబాబుకు జగన్ ఘాటు లేఖ: “ఇదే మంచి అవకాశం.. లేకపోతే అన్యాయమే”

కృష్ణా నదీజలాల పంపిణీ వివాదంపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘాటు లేఖ రాశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (KWDT-II) ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా బలమైన వాదనలు వినిపించాలని ఆయన చంద్రబాబును కోరారు. ఈ కీలక సమయంలో ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే, ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్ తన లేఖలో గతంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని విమర్శిస్తూ, కృష్ణా జలాలపై ఏపీ హక్కులను కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ నిజాయతీగా వ్యవహరించలేదని ఆరోపించారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు పనులు 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ నిజాయితీ లేమి కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంచడానికి కర్ణాటకకు అనుమతి ఇచ్చిందని విమర్శించారు. అంతేకాక, 2014లో కూడా టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు వదులుకుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కీలక తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైఎస్ జగన్ కోరారు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ కోల్పోయే పరిస్థితి తలెత్తినా, దానికి టీడీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేందుకు ఇదే మంచి అవకాశం అని జగన్ తన లేఖలో స్పష్టం చేశారు.