జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై, పార్టీ నిర్మాణం మరియు భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు స్థానిక అవసరాలు మరియు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు క్షేత్రస్థాయి అభివృద్ధిలో కీలక భాగస్వాములై ఉండాలని ఆయన సూచించారు.
ఈ లక్ష్య సాధన కోసం గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, వారు స్థానిక అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఐదుగురు సభ్యుల కమిటీలో కనీసం ఒక మహిళ, 11 మంది సభ్యుల కమిటీలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ అంతర్గత వివాదాలు తలెత్తకుండా వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ‘కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్’ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాకుండా, నామినేటెడ్ పదవుల సమీక్ష సందర్భంగా, మిగిలిన పదవుల భర్తీకి కూటమి నియమాలకు అనుగుణంగా, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారికి మాత్రమే గుర్తింపు ఇవ్వాలని ఆయన నాయకులకు సూచించారు.

