దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో, చలిగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో మంచు చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో, ఉత్తర భారతదేశానికి ప్రయాణించే పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చలి తీవ్రత పెరిగింది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. మినుములూరు, పాడేరులలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొగమంచు ఉండగా, సాయంత్రం ఐదు గంటలకే చలి ప్రారంభమవుతోంది.
తెలంగాణ రాష్ట్రంలోనూ ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావడానికి వెనుకాడే పరిస్థితి ఉంది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదయ్యాయి. కుమరం భీం జిల్లాలో 6.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 6.8 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా కనిష్టంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఈ చలిగాలులకు గట్టిగా వణికిపోతున్నాయి.

