కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి వేళ అత్యంత పవిత్రమైన మకరజ్యోతి దర్శనం భక్తులకు లభించింది. బుధవారం సాయంత్రం 6:30 గంటల నుండి 6:45 గంటల మధ్య పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి మూడుసార్లు ప్రకాశించింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ భక్తులు చేసిన శరణుఘోషతో శబరిగిరులు మారుమోగిపోయాయి.
మకరజ్యోతి దర్శనానికి ముందు పందళం రాజప్రసాదం నుండి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను (స్వామివారి ఆభరణాలు) అయ్యప్ప స్వామికి అలంకరించారు. సాయంత్రం 5:20 గంటలకు ఈ ఆభరణాల ఊరేగింపు సన్నిధానం చేరుకోగా, అనంతరం స్వామివారికి మహదీపారాధన నిర్వహించారు. ఈ దీపారాధన ముగిసిన వెంటనే అల్లంత దూరంలోని పొన్నాంబలమేడుపై జ్యోతి దర్శనమివ్వడం గమనార్హం. ఈ జ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి జ్యోతిర్మయ రూపంగా భక్తులు భావిస్తారు.
ఈ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) మరియు కేరళ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సన్నిధానం, పంబ, నీలిమల, కరిమల వంటి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్శన కోటాపై ఆంక్షలు విధించినప్పటికీ, దాదాపు ఒక లక్షకు పైగా భక్తులు సన్నిధానం పరిసరాల్లో బస చేసి జ్యోతిని వీక్షించారు. జనవరి 19వ తేదీ వరకు స్వామివారి దర్శనం కొనసాగుతుందని, జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారని అధికారులు తెలిపారు.

