తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ వచ్చిన ఆరోపణల కేసులో తమ పార్టీ నేతలకు సీబీఐ సిట్ (SIT) క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన సీబీఐ నివేదికలో తమ నాయకుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని, దీనిని బట్టే తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ అబద్ధపు ప్రచారాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు.
గత ఏడాది కాలంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కలిసి లడ్డూ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని జగన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌డీడీబీ (NDDB), ఎన్డీఆర్ (NDR) ల్యాబ్‌లు కూడా కల్తీ జరగలేదని నివేదికలు ఇచ్చినా, ప్రభుత్వం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. సీబీఐ నివేదిక ద్వారా నిజం బయటపడినందున, తప్పుడు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి నేతలు దేవుడికి, భక్తులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఉన్న సీబీఐ నివేదిక తమకు అనుకూలంగా లేకపోవడంతో, చంద్రబాబు మరో కొత్త కమిటీని వేసి తమ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలను, వారికి సహకరిస్తున్న పోలీసులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని, ప్రస్తుత అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

