AP

బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చుకుందాం: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం బాల్య వివాహాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ శ్యాంప్రసాద్ గారు తెలిపారు.

ఈరోజు సమత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై జిల్లా స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించడం కోసం రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథంను గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్యాం ప్రసాద్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో బాల్యవివాహాలు జరగకుండా చేసి బాల్య వివాహ రహిత భారతదేశాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ యుద్ధ ప్రాతిపదికన విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో సమత స్వచ్ఛంద సంస్థ ఈ ప్రచార రథము ద్వారా శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రచారం చేయడానికి సంకల్పించడం హర్షనీయం అన్నారు. భారత దేశంలో బాల్యవివాహాలు జరుగుతున్న రాష్ట్రాలలో మన రాష్ట్రం 6 వ స్థానంలో ఉంది. వీటిని తగ్గించి బాల్య వివాహరహిత శ్రీ సత్యసాయి జిల్లాగా అందరం కలిసి రూపొందించుకుందామని తెలిపారు. 18 సంవత్సరముల లోపు బాలికలను బడిలోనే ఉంచి చదువు కొనసాగించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అదేవిధంగా బాల్య వివాహం జరుగుతున్నట్లు ఎవరికైనా సమాచారము ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నెంబర్ కు, పోలీసు వారి 112 నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని, అదేవిధంగా బాల్యవివాహాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకమైన రక్షణ యంత్రాంగాలు ఉన్నాయి. ఆ రక్షణ యంత్రాంగాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ బాల్యవివాహాలను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా బాల్య వివాహ నిషేధ అధికారులను నియమించింది. ఆ అధికారులకు ప్రత్యేకమైన అధికారాలను కూడా ఇచ్చింది. అ అధికారులకు బాల్య వివాహ సమాచారాన్ని ఎక్కడికక్కడ తెలుపుతూ గణనీయంగా బాల్య వివాహాలు తగ్గించాలని పిలుపునిచ్చారు.

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల గారు మాట్లాడుతూ ఈ ప్రచార రథం సేవలను గ్రామస్థాయిలో అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ ప్రచార రథం ద్వారా ప్రజలందరూ అవగాహన పొంది బాల్యవివాహాలను నివారించి తద్వారా మాతా శిశు మరణాలను, టీనేజీ ప్రెగ్నెన్సీలను తగ్గించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న బాల్య వివాహ నిషేధ మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యుల గురించి అవగాహన కల్పించుకొని బాల్యవివాహాలు జరుగుతుంటే ఆ సమాచారాన్ని ఆ కమిటీ సభ్యులకు కూడా తెలపవచ్చు అని తెలిపారు.

సమత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మా సమత స్వచ్ఛంద సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలలో బాల్య వివాహాలు, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, బాలలపై జరిగే అత్యాచారాల నివారణ కోసం పనిచేయడం జరుగుతున్నదని తెలిపారు. బాల్యవివాహరహిత భారతదేశ నిర్మాణంలో భాగంగా సమత స్వచ్ఛంద సంస్థ శ్రీ సత్యసాయి జిల్లాలో పురోహితులు, మౌల్వేలు, చర్చి పాస్టర్లు, డ్వాక్రా సంఘాలు, పెళ్లికి క్యాటరింగ్ చేసే వారికి, సప్లయర్స్ వారికి, ట్రైలర్లకు, గ్రామస్థాయి ప్రభుత్వ అధికారులకు, పాఠశాలలు, కళాశాలలలో బాల్యవివాహాల వల్ల జరిగే అనర్ధాలపై మరియు బాల్య వివాహ నిషేధ చట్టం 2006 గురించి, అందులోని శిక్షల గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సువర్ణ గారు, డీఎస్పీ ఇందిర గారు, ప్రభుత్వ వైద్యాధికారిణి మరియు వైద్య సిబ్బంది, జిల్లా బాలల పరిరక్షణ అధికారి మహేష్, సమత స్వచ్ఛంద సంస్థ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు, సెక్రటరీ వెంకటేశులు, మనోహర్ నాయుడు, ఉమా శంకర్ రెడ్డి, సమత స్వచ్ఛంద సంస్థ కమ్యూనిటీ సోషల్ వర్కర్లు సునీత, శారద, కళావతి పాల్గొన్నారు