AP

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసిందని, ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం ఆ శిథిలాల నుంచి నవ్యాంధ్రను పునర్నిర్మిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చట్టసభ గౌరవాన్ని తగ్గించి, దానిని ‘బూతుల అడ్డా’గా మార్చారని జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సభా గౌరవాన్ని కాపాడటమే తమ ప్రాధాన్యతని, ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విద్యార్థులు హుందాగా ప్రసంగించడం సంతోషకరమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సీఎం వివరిస్తూ.. పెన్షన్ల కోసమే ఏడాదికి రూ. 34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 10,700 కోట్లు కేటాయించామని, ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ప్రోగ్రాం చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా 443 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో వెయ్యి ఏసీ బస్సులను తీసుకురానున్నట్లు ప్రకటించారు. రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 20 వేల ఆర్థిక సాయం అందుతోందని గుర్తు చేశారు.

రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ.. నాడు 29 వేల మంది రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో 33 వేల ఎకరాలు ఇచ్చారని, గత ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసినా తాము పునర్నిర్మాణ పనులను వేగవంతం చేశామని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను అందజేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడం ప్రజలకు తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు.