AP

బడ్జెట్‌లో అన్నీ అబద్ధాలే.. అప్పులెంతో ఎందుకు చెప్పలేదు?: ప్రభుత్వంపై బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం!

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం అంతా అబద్ధాల మయమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సభలో వాస్తవాలను దాచి అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి కొత్తదనం లేదని, గతంలో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాన్నే మళ్లీ చదివినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పుల గురించి పదేపదే మాట్లాడే కూటమి ప్రభుత్వం, ఈ బడ్జెట్‌లో రాష్ట్రంపై ఉన్న అసలు అప్పు ఎంత ఉందో స్పష్టంగా ఎందుకు వెల్లడించలేదని ఆయన నిలదీశారు.

తమ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 9 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, సుమారు లక్షా 35 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని ఆయన వివరించారు. సంక్షేమం మరియు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని ఆయన విమర్శించారు.

గ్రామీణ స్థాయిలో వైద్యం మరియు వ్యవసాయం కోసం తాము చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్ లు, 10,775 రైతు భరోసా కేంద్రాలను (RBKs) ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే సేవలను తీసుకొచ్చామని తెలిపారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడానికి రూ. 3,700 కోట్లు ఖర్చు చేశామని, ఈ బడ్జెట్‌లో గత పథకాలకు నిధుల కోత విధించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.