AP

అబద్ధాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మాజీ సీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు

జగన్ నిర్వహించిన మీడియా సమావేశంపై స్పందించిన అచ్చెన్నాయుడు, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదని, తన సొంత పనుల కోసం ప్రజాధనాన్ని విమానాలకు దుర్వినియోగం చేసిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న పర్యటనలను ‘జల్సాలు’గా అభివర్ణించడం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారం మరియు టెండర్ల అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘సూపర్ సిక్స్’ పథకాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, జగన్ లాగా ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ప్రజల ముక్కు పిండి వసూలు చేసే రకం తమది కాదని స్పష్టం చేశారు. అంకెల గారడీతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న జగన్ మాటలను ఎవరూ నమ్మరని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేకనే జగన్ సభకు రాకుండా మీడియా ముందు సాకులు చెబుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 11 సీట్లకు పరిమితమైనా ఆయనలో అహంకారం తగ్గలేదని, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజలు తమ తీర్పుతో ఎవరి స్థానం ఎక్కడో చూపించారని, మీడియా ముందు ఏడవడం మానుకోవాలని అచ్చెన్నాయుడు ఘాటుగా సూచించారు.