AP

ఆ ‘నాటకాల రాయుడు’ వేషాలు ఇక సాగవు: తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలేది లేదు – సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మహా పాపానికి బాధ్యులైన వారిని నడిరోడ్డుపై నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గుజరాత్‌లోని ఎన్డీడీబీ (NDDB) ల్యాబ్ నివేదిక ప్రకారం, ప్రసాదంలో వాడినది నెయ్యి కాదని, జంతువుల కొవ్వు అని తేలిందని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమాల నుండి తప్పించుకోవడానికే వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ‘నాటకాల రాయుడు’ అని సంబోధిస్తూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత చిన్నాన్న కుమార్తెనే మోసం చేసేలా జగన్ నాటకాలు ఆడారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ‘బూతుల పార్టీ’గానే మిగిలిపోయిందని, గతంలో అసెంబ్లీ వేదికగా తన భార్యపై చేసిన వ్యక్తిత్వ హననాన్ని ప్రజలు మర్చిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో స్వామివారి ఫోటోలను చెప్పులతో పట్టుకుని వైసీపీ నేతలు హిందూ ధర్మం పట్ల తమ అహంకారాన్ని ప్రదర్శించారని విమర్శించారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారని, ఆర్థికంగా రాష్ట్రాన్ని కుంగదీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని, మత్తు పదార్థాల రవాణాను ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టం చేశారు. మదనపల్లి ఘటనలో నిందితుడి ఆత్మహత్యే తమ ప్రభుత్వ భయానికి నిదర్శనమని పేర్కొంటూ, శాంతిభద్రతల పరిరక్షణే తన తొలి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.